*ఇది యూత్ అందరికీ ఎదురయ్యే, సామాన్యంగా, చాలా మందికి కామెడీగా అనిపించే చాలా పెద్ద సమస్య!*
"ఏడు రంగుల హరివిల్లు ప్రేమ!
తొలి చూపుతో మొదలయ్యే ఆకర్షణే మొదటి రంగు.
ఆ క్షణము నుండే, ఆ అణువంత క్షణం నుండే మదిలో మెదిలే చిరు ఆశే రెండో రంగు.
ముఖమున నవ్వులు చిందాలని, ఆ నవ్వులు నాకే చెందాలనే స్వార్ధమే మూడో రంగు.
కన్నుల నీరే రావద్దని, నేనైన ఆ నీటిని జార్చొద్దనే బాధ్యతే నాలుగో రంగు.
బంధం వదులుకోలేమని, అనుబంధం వదులుకావద్దనే దృఢ సంకల్పమే ఐదో రంగు.
అలా తొలి చూపుతో మొదలైన ప్రయాణం ...
ఎడడుగుల పరిణయం దాకా నడిపించే పరిణామమే ఆరో రంగు
ఈ ఆరు రంగులు కలిసిన మహాద్భుతమైన, పరిపూర్ణమైన, సహజీవనమే ఏడో రంగు
ఈ ఏడు రంగులు కలిసిన అందమైన హరివిల్లే ప్రేమంటే!
ఇలా ప్రేమనేది ఆకర్షణతోనే మొదలవుతుంది. కానీ, చాలా మంది ఆ ఆకర్షణనే ప్రేమనుకుని భ్రమపడుతున్నారు, ఆ భ్రమ దగ్గరే ఆగిపోతున్నారు. మిగతా రంగులని చూడలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ఇవ్వన్నీ దాటకుండానే ఆవేశపడిపోయి చాలా మంది అనవసరంగా అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు. అందుకే ఆకర్షణకు, ప్రేమకు మధ్యనున్న వ్యత్యాసాన్ని తెలుసుకోండి, ఆకర్షణ అనే గీతను దాటి ముందుకెళ్లి చూడండి, నిజమైన ప్రేమంటే ఏంటో, అది ఎంత అందంగా, అద్భుతంగా ఉంటుందో మీకే తెలుస్తుంది.
పైన ప్రస్తావించింది ఒక సమస్య. ఇక రెండో సమస్య...
చాలా మంది ప్రేమ అనే పవిత్రమైన మాటను అడ్డుపెట్టుకుని అడ్డమైన వేషాలు వేస్తుంటారు. వాళ్ళ సరదాలను, అవసరాలను తీర్చుకోవటానికి ప్రేమ అనే పదాన్ని వాడుకుంటున్నారు. పాపం కొంతమంది అమాయకులు వీళ్ళ మాయలో పడి మోసపోతున్నారు. ఇలాంటి విలువలేని మనుషులు చేసే చర్యలు వల్ల ప్రేమకున్న విలువ పోతుంది.
ఈ సందర్బంగా మోసం చేసే వాళ్ళకి, మోసపోయే వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే...
"ప్రేమించే వాళ్ళని మోసం చేయద్దు
మోసం చేసే వాళ్ళని ప్రేమించద్దు"
అలాగే చాలా మంది ప్రేమలో ఓడిపోయామంటూ ఉంటారు...
అందరు ప్రేమిస్తారు, కానీ, అందరూ తిరిగి ప్రేమించబడరు. ప్రేమించబడనంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. ప్రేమించటం నీ చేతుల్లోనే ఉంటుంది, కానీ, ప్రేమించబడటం అనేది ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రేమించేటప్పుడు ఆస్తి-అంతస్థు, కులం-మతం, రంగు... ఇలాంటివేమీ లెక్క చేయకుండా ప్రేమించే నువ్వు 'తిరిగి ప్రేమించబడతామో లేదో అని ఖచ్చితంగా చెప్పలేము' అన్న నిజాన్ని గుర్తుంచుకుని ప్రేమించాలి, ప్రేమించబడకపోయిన తట్టుకునే శక్తి నీ మనసుకుండాలి.
నీ ప్రేమను నిరాకరించిన తరువాత కూడా తన సంతోషాన్ని నువ్వు కోరుకోగలిగితే నువ్వు నీ ప్రేమలో గెలిచినట్టే.
పైన ప్రస్తావించిన రెండు సమస్యలే ఎంతో మంది ప్రేమికుల ఆత్మహత్యలకు, ఈ రోజుల్లో అటు పెద్దవాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళను నిరాకరించడానికి, ఇటు మిగతా మనుషుల్లో కూడా ప్రేమ మీద ఉన్న నమ్మకం కోల్పోవటానికి కారణాలు. అందుకే ఒక్కసారి ఆలోచించండి, ఈ సమస్యలను నియంత్రించడానికి ప్రయత్నించండి, మళ్ళీ ప్రేమకు ప్రాణం పొయ్యండి.
ఒక్క మాటలో చెప్పాలంటే…
సృష్టికి మూలం ప్రేమే!
ప్రేమ నుండి జనించినదే ఈ లోకమంతా. ఎంతటి వారినైనా ప్రేరేపించగలిగే, కరుడు కట్టిన హృదయాన్ని సైతం కరిగించి కదిలించగలిగే శక్తి ప్రేమకుంది!
అంతటి అనన్యమైన స్థాయి ఉన్న ప్రేమను మీ అనాలోచిత చర్యల చేత దయచేసి దిగజార్చద్దు!"
... మీ హేమంత్

Telugu Poem by Hemanth Karicharla : 111659220

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now